లేడీ డాక్టర్‌గా నటిస్తూ ఘరానా మోసాలు

  • వైద్యురాలిగా నటిస్తూ ఆసుపత్రుల్లో చోరీలకు పాల్పడుతున్న జంట అరెస్ట్
  • రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంగారు ఆభరణాల దోపిడీ
  • ఫార్మసీ విద్యార్థిని శిరీష, ఆమె భర్త సాయికుమార్‌ను పట్టుకున్న పోలీసులు
  • నిందితుల నుంచి 11 తులాల బంగారం, కారు స్వాధీనం
వైద్యురాలిగా నటిస్తూ ఆసుపత్రుల్లోని రోగులకు మత్తుమందు ఇచ్చి వారి బంగారు ఆభరణాలను దోచుకుంటున్న కిలాడీ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ ఫోర్స్, మార్కెట్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన గౌండ్ల శిరీష, ఆమె భర్త ఎడులపల్లి సాయికుమార్ నిందితులుగా తేలింది.

ప్రస్తుతం ఫార్మసీలో డాక్టరేట్ (ఫార్మ్.డి) చేస్తున్న శిరీష, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తన వైద్య పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకుంది. డాక్టర్లు ధరించే యాప్రాన్ వేసుకుని ఆసుపత్రి వార్డుల్లోకి ప్రవేశించి, వారికి 'డయిజీపామ్' అనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయాక నగలు దొంగిలించి, బయట వేచి చూస్తున్న భర్త సాయికుమార్‌తో కలిసి పరారయ్యేది.

గత మార్చి 11న సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రితో పాటు, చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ వీరు ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతూ, షాపింగ్ చేసేవారని విచారణలో తేలింది. నిందితుల నుంచి పోలీసులు సుమారు 11 తులాల బంగారం, ఒక మారుతీ బాలెనో కారు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, ఇంకా ఏమైనా నేరాలకు పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
 

Goundla Shirisha
Lady Doctor
Fake Doctor
Hospital Theft
Anesthesia
Hyderabad Crime
Secunderabad
Citizen Hospital
Yashoda Hospital
Sai Kumar

More Telugu News